Chandrababu: 2027 నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తాం...! 5 d ago

AP : విభజన తరువాత ఏడు మండలాలు తెలంగాణలోకి వెళ్లాయని వాటిలో ఏపీలో కలిపేందుకు ప్రధానితో మాట్లాడి ఒప్పించానన్నారు సీఎం చంద్రబాబు. జగన్ అధికారంలోకి వస్తే నిర్వాసితులకు రూ.10 లక్షలు ఇస్తామని చెప్పారే తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వం నిర్వాసితులను మోసం చేసిందని, కానీ తాము వీలైనంత వరకు న్యాయం చేస్తామన్నారు. జగన్ పాలనలో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయిందని, వైసీపీ నిర్లక్ష్యంతో వందల కోట్ల ప్రజాధనం వృథా అయిందన్నారు. ప్రాజెక్టు కోసం కొందరు భూములు ఇచ్చి అనేక ఇబ్బందులు పడ్డారని, టీడీపీ అధికారంలో ఉంటే పోలవరం ప్రాజెక్టు 2020లోనే పూర్తి అయ్యేదని తెలిపారు.
పునరావాసం ప్యాకేజీని 2026 నాటికి అందజేస్తామని, పునరావాసం కల్పించిన తరువాతే ప్రాజెక్టు నుంచి నీళ్లు వదులుతామని చెప్పారు. ఏపీకి ఈ ప్రాజెక్టు జీవనాడి అని, ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే రాష్ట్రం బాగుపడుతుందన్నారు. నిర్వాసితులకు రూ.828 కోట్లు విడుదల చేశామని, గతంలో కూడా రూ.4,311 కోట్లు చెల్లించామని చెప్పారు. పోలవరం నిర్వాసితులను ఆదుకున్న ప్రభుత్వం తమదే అని, మధ్యవర్తులు లేకుండా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని పేర్కొన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో 33 సార్లు ఈ ప్రాజెక్టును సందర్శించానని, జగన్ ఐదేళ్లలో ఒక్కసారైనా కనిపించారా అని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును 2027 నాటికి పూర్తి చేస్తామన్నారు.